Trump-Zelensky Clash: శాంతి ఒప్పందంపై ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య ఘర్షణ 1 y ago
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. రష్యాతో యుద్ధం ముగింపు పలికేందుకు.. శాంతి ఒప్పందం కుదర్చడం విషయమై ట్రంప్ ను కలిశారు జెలెన్‌స్కీ. ముప్పావుగంటసేపు సాగిన భేటీలో చివరి 10 నిమిషాలు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. శాంతి ఒప్పందానికి బదులు ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని ట్రంప్ ప్రతిపాదించారు. అయితే దీనిపై జెలెన్‌స్కీ స్పందిస్తూ భవిష్యత్తులో తమపై రష్యా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ట్రంప్‌ను ఒత్తిడి చేశారు. దీంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇన్నాళ్లుగా సాయపడుతూ వస్తున్న దేశంతో మాట్లాడే పద్ధతి ఇది కాదని, ఇది అవమానకరంగా ఉందని ట్రంప్ మండిపడ్డారు. తమతో లావాదేవీకి ఇది సరైన పద్ధతి కాదని, ఏమాత్రం కృతజ్ఞత లేకుండా, అమర్యాదగా ప్రవర్తించడం బాగోలేదన్నారు. మీరు డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేరని జెలెన్‌స్కీపై కోపాగ్రహాన్ని వ్యక్తం చేశారు. శాంతి ఒప్పందం కుదర్చాలంటే తాము ప్రతిపాదించిన వాటికి అంగీకరించాలని లేదంటే తాము తప్పుకుంటామని చెప్పారు. అప్పుడు మీరొక్కరే పోరాడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. తమ నుంచి అందుకున్న సాయానికి ఒక్కసారైనా థాంక్స్ చెప్పారా అని నిలదీశారు.
ఇక దీనిపై జెలెన్‌స్కీ స్పందిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఒక ఉగ్రవాదిగా అభివర్ణించారు. అలాంటి 'హంతకుని'తో, నియంతతో రాజీపడాల్సిన అవసరం లేదన్నారు. చర్చలు రసాభాసగా మారడంతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్‌స్కీ బయటకు వచ్చేశారు. దీంతో చర్చ అర్ధాంతరంగా ముగిసింది.